Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉన్నావో కేసు ఎట్టకేలకు ముందుకు కదిలింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ పై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు పోస్కో చట్టంలో పలు సెక్షన్ల కింద సెంగార్ పై కేసు నమోదుచేసినట్టు ఉన్నావో ఎస్పీ పుష్పాంజలీ దేవి వెల్లడించారు. కేసు నమోదు తర్వాత కూడా పోలీసులకు లొంగిపోవడానికి సెంగార్ నిరాకరించారు. తన అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని సమర్థించుకున్నారు. సెంగార్ వెంట పెద్ద సంఖ్యలో మద్దతుదారులు రావడంతో ఎస్పీ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. కొద్దిసేపటికి సెంగార్ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ కేసులో విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం కేసులో తీవ్ర వైఫల్యాలు ఉన్నట్టు గుర్తించింది.
పోలీసులతో పాటు..ఉన్నావో వైద్యుల వైఫల్యాలూ ఉన్న ట్టు బయటపడడంతో ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. సెంగార్ అరెస్టు పై సీబీఐ నిర్ణయం తీసుకుంటుందని పోలీసులు వెల్లడించారు. గత ఏడాది జూన్ 4న సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 16 ఏళ్ల బాలిక ఫిర్యాదుచేసింది. అత్యాచారంపై ఎవరికైనా ఫిర్యాదుచేస్తే …తన కుటుంబాన్ని చంపేస్తానని కూడా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత మళ్లీ తనను అపహరించి తొమ్మిదిరోజుల పాటు మత్తు పదార్థాలు ఎక్కించి అనేక ప్రాంతాలు తిప్పుతూ పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదన్న ఆవేదనతో గతవారం ఆ బాలిక ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో మరో విషాదం కూడా చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, బాధితురాలి తరపు బంధువులకు మధ్య జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యారు. అంతేకాకుండా ఆయన కస్టడీలోనే మరణించారు. ఎమ్మెల్యేనే తన తండ్రిని చంపించాడని బాలిక ఆరోపిస్తోంది. సెంగార్ పై కేసు నమోదు నేపథ్యంలో బాధిత బాలికకు, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని రాష్ట్రప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ దారుణంపై కుల్ దీప్ సెంగార్ సొంతపార్టీ బీజేపీలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి మండిపడ్డారు. సమాజంలో మహిళలకు అలాంటి వ్యక్తుల వల్ల భద్రత ఉండదని, ఆయనలాంటివారు దేశంలోనే కాకుండా సమాజంలో కూడా ఉండేందుకు వీల్లేదని, ఆయన జైల్లో ఉండడమే సరైనదని అభిప్రాయపడ్డారు.