మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని పరేల్ ప్రాంతంలో ఉన్న క్రిస్టల్ టవర్లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. క్రిస్టల్ టవర్లోని 12 నుంచి 15 వ అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ టవర్లో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. మంటలు ఎగిసి పడడంతో పలువురు ఆ అంతస్తులో చిక్కుకున్నారు. ముందు 12వ అంతస్తులో పెద్ద ఎత్తున అంటుకున్న మంటలు కొద్ది క్షణాల వ్యవధిలోనే 13, 14, 15 అంతస్తులకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో ఇంకా 10 మంది చిక్కుకుని ఉన్నట్టు తెలుస్తోంది.అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. లోపల చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట 10 ఫైర్ ఇంజన్లు ఘటనస్థలికి చేరుకోగా ప్రమాదం తీవ్రత అధికంగా ఉండటంతో అగ్నిమాపక శాఖ అధికారులు మరో 10 ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో ఇద్దరు చనిపోగా అనేక మంది గాయపడ్డారని ఇంకా ఎంత మంది లోపలున్నారో తెలియడం లేదని అక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.