ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పహాడిషరీఫ్ మామిడిపల్లి ప్రాంతానికి చెందిన శైలజ తన మూడు నెలల చిన్నారిని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చూపించేందుకు మరో కుమారుడు శ్రీహాన్స్ (6), తన సోదరి కుమారుడు విజయ్ (12)తో కలసి కారులో బయలుదేరింది.
వాహనం ఆరాంఘర్ పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా మెహదీపట్నం వైపు వెళుతోంది. మార్గమధ్యలోని అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 132 వద్దకు రాగానే కారు వెనుక నుంచి పొగలు వస్తుండటాన్ని శైలజ కుమారుడు గమనించాడు. విషయం చెప్పగానే వాహనాన్ని పక్కకు ఆపి చూసే సరికి మంటలు ఎగిసి పడుతున్నాయి. డోర్ లాక్ తీసి తన మూడు నెలల చిన్నారిని బయటకు తీసింది. అప్పటికే వెనుక డోర్ లాక్ పడటంతో ఇద్దరు చిన్నారులు లోపలే చిక్కుకుపోయారు.
ఈ దారి గుండా వెళ్తున్న రవి అనే యువకుడు వెంటనే స్పందించాడు. కారు అద్దాలను పగులగొట్టి ఇద్దరు చిన్నారులను సురక్షితంగా బయటకు తీశాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ కనకయ్య, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్‌సుందర్ సందర్శించారు. శైలజతో పాటు ముగ్గురు చిన్నారులను సురక్షితంగా మరో వాహనంలో ఇంటికి చేర్చారు.