దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. కొంత సమయానికే భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 20 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం సైతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నట్లు సమాచారం.
ఘటన జరిగిన సమయంలో 200 నుంచి 300 మంది మరకు సిటీ సెంటర్ మాల్‌లో ఉన్నారు. తొలుత దీన్ని లెవల్ 1 ప్రమాదమని ప్రకటించారు. ఆపై తీవ్రతను చూసి లెవల్ 3 (భారీ) అగ్ని ప్రమాదమని తెలిపారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో శుక్రవారం ఉదయం ఈ అగ్నిప్రమాదాన్ని లెవల్ 5 ఘటనగా పేర్కొన్నారు. సిటీ సెంటర్ మాల్‌లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మాల్ పక్కనే ఉన్న 55 అంతస్తుల భవనాన్ని ఖాళీ చేయించి దానిలో ఉన్న 3500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో నలుగురు అగ్నిమాపక సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం జేజే ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం వరకు మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఒకేరోజు ముంబైలో రెండు అగ్నిప్రమాదాలు సంభవించాయి. గురువారం అంతకుముందు కుర్లా వెస్ట్ ప్రాంతంలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. రెండు గంటలపాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు.