కొవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 50 మందికిపైగా కరోనా బాధితులు చనిపోయిన విషాద ఘటన ఇరాక్‌లో చోటుచేసుకుంది. నసీరియా పట్టణంలోని అల్- హుస్సేన్ కొవిడ్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనలో 50 మంది చనిపోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోని సోమవారం రాత్రి ఆక్సిజన్ ట్యాంక్ పేలి మంటలు వార్డుకు వ్యాపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. 70 పడకల సామర్ధ్యం ఉన్న కరోనా వార్డును 3 నెలల క్రితం ప్రారంభించారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆసుపత్రి చుట్టూ మంటల వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో కొవిడ్ వార్డుల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకురావడం కష్టంగా మారిందని ఓ అధికారి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ బాగ్దాద్‌లోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది రోగులు చనిపోగా, 110 మంది గాయపడ్డారు.
తాజా ఘటనపై ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్ ఖాదిమి స్పందించారు. సీనియర్ మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసిన ఆయన.. నస్రియా ఆస్పత్రి అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రత, సివిల్ విభాగం అధికారులను తక్షణమే అరెస్ట్ చేయడాలని ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదం జరిగే సమయానికి వార్డులో కనీసం 83 మంది ఉన్నట్టు మీడియా కథనాలు తెలియజేశాయి. దట్టంగా పొగలు అలముకోవడంతో చాలా మంది ఊపిరాడక చనిపోయారని రాయిటర్స్ తెలిపింది.
మంటలు అదుపులోకి వచ్చినా పొగలు మాత్రం దట్టంగా వ్యాపించాయి. లోపల చిక్కుకున్నవారి కోసం గాలింపు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కరోనా వార్డు లోపల భారీ పేలుడు వినిపించిందని తర్వాత మంటలు వ్యాపించాయని ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్ అలీ ముహసిన్ అన్నారు. అగ్ని ప్రమాదం తర్వాత కొందరు రోగులు కనిపించకుండాపోయారని, వీరిలో ఇద్దరు ఆరోగ్య సిబ్బంది ఉననారని అధికార వర్గాలు తెలిపాయి.
అటు, బాధితుల బంధువులు, కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగి, రెండు వాహనాలకు నిప్పంటించారు. కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇరాక్ కూడా ఒకటి. ఇప్పటివరకు అక్కడ 14 లక్షల కొవిడ్ కేసులు నమోదు కాగా, 17,000పైగా చనిపోయారు.