భారీ అగ్ని ప్రమాదం

భారీ అగ్ని ప్రమాదం

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన స్వాతి కాటన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం 16వ నంబర్‌ జాతీయ రహదారికి ఆనుకుని కాటన్, స్పిన్నింగ్, టెక్స్‌టైల్స్, అయిల్‌ మిల్స్‌ తదితర వ్యాపారాలకు సంబంధించిన కంపెనీలున్నాయి. కంపెనీ డైరెక్టర్‌ బి.అంకమ్మరావు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారు జామున డీలింట్‌ కాటన్‌  బేల్స్‌ఉన్న గోడోన్‌ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో సంస్థ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది.

మంటలు భారీగా చెలరేగడంతో అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేసేందుకు నరసరావుపేట, చీరాల, గుంటూరు–1 నుంచి అగ్నిమాపక వాహనాలు తెప్పించారు. ఉదయం 10 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాద స్థలానికి గుంటూరు డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. దీనిపై కంపెనీ డైరెక్టర్‌ అంకమ్మ రావు మాట్లాడుతూ విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులకు వివరించారు. రూ. 40లక్షలు నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. స్వాతి కాటన్‌ మిల్స్‌ను అగ్ని మాపక శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి సందర్శించారు. జరిగిన సంఘటన తీరుపై విచారిస్తున్నామని, నష్టాన్ని అంచానా వేస్తున్నామని వివరించారు.