రాజ్‌ఘాట్‌ సమీపంలో భారీగా మంటలు

రాజ్‌ఘాట్‌ సమీపంలో భారీగా మంటలు

యమున నది తీరాన.. మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకుని మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అటవీ ప్రాంతంలో మంటలు రావడంతో కార్చిచ్చుగా భావించారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక వాహనాలు తీవ్రంగా శ్రమించాయి.

యమున నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ సమీపంలోనే మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ ఉంది. ఈ మంట వ్యాప్తితో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 12 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అయితే దట్టమైన పొగలు రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ముందే కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీలో ఈ పొగ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నది ఒడ్డున మంటలు ఎలా వచ్చాయనేది ఇంకా తెలియడం లేదు. దీనిపై అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ మంటలు వ్యాపించిన ప్రాంతానికి సమీపంలోనే ఇందిరా గాంధీ స్టేడియం, రాజ్‌ఘాట్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఉంది.