కోల్‌కతాలోని ఓ వైద్యకళాశాలకు అనుబంధమైన ఆస్పత్రి అగ్నికీలల్లో చిక్కుకుంది. ఫార్మసీ విభాగాన్ని ఒక్కసారిగా పొగలు చుట్టుముట్టడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. 250 మంది రోగులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.అందుతున్న సమాచారం ప్రకారం కలకత్తా మెడికల్ కాలేజ్ కు అనుబంధంగా ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రి ఫార్మసీ విభాగంలో ఉదయం ఒక్కసారిగా పొగలు చుట్టుముట్టాయి. అనంతరం మంటలు వ్యాపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని కిటికీల నుంచి దూకి చాలామంది తప్పించుకున్నారు. కదలలేని రోగులు నిస్సహాయ స్థితిలో సహాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మిగిలిన రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆస్పత్రిలోని రోగులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. పది అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం ఏర్పడి ఉండొచ్చని తెలుస్తోంది. కోల్‌కతాలోని అత్యంత పురాతన హాస్పిటల్‌లో కలకత్తా మెడికల్ కాలేజ్ భవనం ఒకటి. 2011, డిసెంబరులో కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ హాస్పిటల్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 92 మంది చనిపోయారు. అర్థరాత్రి అంతా నిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టడంతో కదల్లేని పరిస్థితుల్లో ఉన్న రోగులు మంటల్లో కాలిపోయారు. మరలా ఏడేళ్ళ అనంతరం ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం అది కూడా ఉదయం సమయంలో కావడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పింది.