జమ్మూ కశ్మీర్‌లో సోమవారం ఉదయం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లిన సైనిక బృందంలోని జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, నలుగురు సైనికులు సైనిక వర్గాలు తెలిపారు. పీర్ పంజాల్ రేంజ్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాన్ని తిప్పికొట్టే క్రమంలో సైనికులు బలయ్యారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపింది.
పూంచ్ జిల్లా సురాన్‌కొటే పరిధి డీకేజీ గ్రామాల్లో ఉగ్రవాదుల తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ సోమవారం తెల్లవారుజామున అక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ సమయంలోనే ఉగ్రవాదులు కాల్పులకు జరపడంతో సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. దీంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు కూడా హతమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేసీఎం, నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖను దాటి దేశంలోకి భారీ ఆయుధాలతో ప్రవేశించిన ఉగ్రవాదులు.. చామరేర్ అడవుల్లో ఆశ్రయం పొందుతున్నట్టు పేర్కొన్నాయి. అదనపు బలగాలను రప్పించి, ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోందని వివరించాయి.