కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి కేంద్రం పొడిగించింది. జులై 31 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోనందు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గతేడాది మార్చి నుంచి కొనసాగుతున్న ఈ నిషేధాన్ని జులై 31 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ లేఖను విడుదల చేసింది.
అంతర్జాతీయ విమానాలపై జులై 31 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన డీజీసీఏ.. కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది. అయితే.. ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రం అనుమతించిన విమానాల రాకపోకలను ప్రాధాన్య క్రమంలో అధికారుల అనుమతితో నడపవచ్చని డీజీసీఏ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను గతేడాది మార్చి 23 నుంచి డీజీసీఏ నిలిపివేసిన విషయం తెలిసిందే.
అయితే, వందే భారత్ మిషన్లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని విదేశీ విమాన సర్వీసులను కొనసాగిస్తోంది. కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక విమానాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత సుమారు 27 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. ఈ దేశాల నుంచి భారత్కు రాకపోకలు సాగించే విమానాలకు ఎలాంటి ఆటంకం ఉండదు.
గతేడాది కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత మే 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభమయ్యాయి. కానీ, గత 16 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ అలాగే కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు నెల రోజుల పాటు ఈ నిషేధాన్ని పొడిగించడం గమనార్హం.