విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి చుక్కలు చూపిస్తున్నాయి విమానయాన కంపెనీలు. ముఖ్యంగా అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారి నుంచి ముక్కుపిండి మరీ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇండియా నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, గల్ఫ్ తదితర దేశాలకు ప్రయాణం చేయడంపై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇటీవలే క్రమంగా ఒక్కో దేశం అంతర్జతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తున్నాయి. తాజాగా అమెరికా సైతం నవంబరు 8 నుంచి ఆంక్షలను సడలించింది. రెండు డోసులు టీకాలు తీసుకున్న వ్యక్తులను తమ దేశంలోకి అనుమతిస్తామని పేర్కొంది.
అమెరికా ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు తొలగిపోవడంతో ఎంతో కాలం నుంచి అక్కడికి వెళ్లాలనుకునే వారికి ఊరట లభించింది. దీంతో ఒక్కసారిగా విమాన టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు. గత ఏడాది కాలంగా విమాన సర్వీసులు లేక ఇక్కట్లు ఎదుర్కొన్న విమానయాన సంస్థలు ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో విమాన ఛార్జీలను ఒక్కసారిగా అనూహ్యంగా పెంచాయి.
ఇండియా నుంచి అమెరికాకు సింగిల్ జర్నీ టిక్కెట్ల ధరల మోత మోగుతోంది. ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాల అందిస్తున్న సమాచారం ప్రకారం.. నిన్నామొన్నటి వరకు సింగిల్ జర్నీ టిక్కెట్టు ధర రూ.87,000ల నుంచి రూ.1.02 వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఈ టిక్కెట్ల సగటు ధర రూ. 1.5 లక్షలకు చేరుకుంది, ఇక రద్దీ ఎక్కువగా ఉండే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, షికాగో నగరాల వరకు టిక్కెట్ల ఛార్జీలయితే ఆకాశాన్ని తాకుతున్నాయి. సింగిల్ జర్నీ టిక్కెట్ ధర ఏకంగా రూ.3 లక్షల దగ్గరగా ఉంటోంది. ఇక బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధర నిన్నామొన్నటి వరకు రూ.3.5 లక్షలకు అటుఇటు ఉండగా ఇప్పుడు రూ.6 లక్షలకు పైమాటగానే చెబుతున్నాయి విమానయాన సంస్థలు.
టిక్కెట్ల ధరలు అనూహ్యంగా పెరిగినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దాదాపు ఏడాదిన్నర ప్రయాణాలకు అనుమతులు రావడం, టీకా కార్యక్రమం సైతం పూర్తయిపోవడంతో ఛార్జీలు పెరిగినా సరే అమెరికా ప్రయాణం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు భారతీయులు. ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే మరోసారి థర్డ్‌వేవ్ అంటూ మొదలైతే.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనే ఆందోళన కూడా నెలకొంది. ఫలితంగా విమాన ప్రయాణ ఛార్జీలు పెరిగినా.. ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు.