రేణిగుంటలో విమానాశ్రయంలో ఎమర్జన్సీ…ఎందుకంటే…!

Flights delayed As Tirupati Airport Shuts For Three Hours

తిరుపతి, రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిన్న మధ్యాహ్నం ఏఐ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో, రన్‌ వే చివర కుంగినట్టు పైలట్ కు కనిపించింది. దీంతో, పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని గాల్లోకి లేపి, విషయాన్ని విమానాశ్రయ అధికారులకు చేరవేశాడు. ఈ విమానంలో పలువురు ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో ఈ ఘటన జరుగగా వెంటనే విమానాశ్రయంలో ఎమర్జన్సీ విధించిన అధికారులు రాకపోకలలు నిలిపివేశారు. రాత్రి 7.40 గంటల తరువాత విమానాల రాకపోకలకు అనుమతులు లభించాయి. దీంతో వివిధ విమానాలలో వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్‌ పోర్ట్‌ లో అవస్థలు పడ్డారు.

తిరుపతి నుంచి టేకాఫ్ కావాల్సిన పలు విమానాలు నిలిచిపోగా, హైదరాబాద్, బెంగళూరు నుంచి రావాల్సిన విమానాలు ఆలస్యం అయ్యాయి. కాగా, రేణిగుంట విమానాశ్రయం రన్ వే విస్తరణ పనులు ప్రస్తుతం కొనసాగుతుండగా, మంగళవారం నాడు భారీ వర్షం పడింది. ఈ వర్షం కారణంగానే రన్ వే కుంగినట్టు తెలుస్తోంది. ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకునే విమానాల్లో ఎయిర్ ఇండియా చెందిన బోయింగ్ అతి పెద్దది. మిగతా విమానాలు చిన్నవే కావడంతో సులువుగా టేకాఫ్ అవుతుంటాయి. మధ్యాహ్నం 2.50 గంటలకు టేకాఫ్ కు ప్రయత్నించిన బోయింగ్ విమానం పైలట్లు, రన్ వే కుంగిన విషయాన్ని గుర్తించారు. ఆపై ఆ విమానాన్ని టేకాఫ్ చేసి, విషయాన్ని కేంద్ర విమానయానశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.