ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్సులో వరదల కారణంగా 16 మంది మరణించారు. భారీ వర్షాలకు పలు గ్రామాలు నీట మునిగినట్లు అధికారులు పేర్కొన్నారు. దాదాపు 23 మంది గల్లంతయినట్లు జాతీయ విపత్తు సహాయ బృందం ప్రతినిధి రాదిత్య జాతి తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, అయితే వర్షం కారణంగా సహాయకచర్యలకు ఇబ్బంది వాటిల్లుతుందని చెప్పారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు సమీపంలోని మూడు నదులను ముంచెత్తాయి. దీంతో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల కారణంగా వందలాది ఇళ్లు ద్వంసం అయినట్లు గుర్తించారు. దాదాపు 4000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు ఉత్తర లువు జిల్లా కలెక్టర్ ఇందాపుత్రి పేర్కొన్నారు. వరద ఉదృతికి విమానాశ్రయం రన్ వే సహా రహదారి ప్రాంతాలు దెబ్బతిన్నాయని వివరించారు. ఈ ఏడాది జనవరిలోనూ భారీ వర్షాల కారణంగా ఇండోనేషియాలో 66 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.