జమ్మూ కశ్మీర్‌లో ఆకస్మిక వరదలు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 40 మంది ఆచూకీ గల్లంతయ్యింది. కిస్టావర్ జిల్లాలో బుధవారం ఉదయం ఆకస్మిక వరదలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. డచ్చన్ మండల పరిధిలోని హోంజార్ గ్రామంలో ఈ వరదలకు కనీసం ఎనిమిది ఇల్లు ధ్వంసమయ్యాయని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఆకాశానికి చిల్లుపడినట్టు భారీ వర్షం కురిసి సమీపంలోని గ్రామాన్ని ముంచెత్తింది. ఘటనపై సమాచారం తెలియగానే హుటాహుటిన గ్రామానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
గల్లంతైన వారిని రక్షించేందుకు సైన్యం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగాయని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. పరిస్థితిని దగ్గరుండి పరిశీలిస్తున్నామని, కిష్టావర్ జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు చెప్పారు ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. అవసరమైతే వైమానిక దళం సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్లలో తరలించేందుకు ఎయిర్ఫోర్స్ అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు.
గత కొద్ది రోజులుగా జమ్మూ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలాఖరు వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందన్న ఐఎండీ అంచనాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదులు, కొండ ప్రాంతాలకు సమీపంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.. దీని వల్ల నదులు, వాగులు, కొండ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని జమ్మూ కశ్మీర్ అధికారులు అత్యవసర సూచనలు జారీచేశారు.
మరోవైపు, హిమాచల్ప్రదేశ్లోనూ ఆకస్మిక వరదలు సంభవించాయి. లాహౌల్-స్పీతి, కులు, చంబ జిల్లాల్లో వరదలకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కులులో 25 ఏళ్ల మహిళ.. తన నాలుగేళ్ల కొడుకుతో బ్రహ్మగంగా నదిలో కొట్టుకుపోయింది. నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో ప్రవాహంలో అదుపుతప్పిపోయారు. భారీ వర్షాల కారణంగా లాహౌల్-స్పీతి జిల్లాలో వరద పోటెత్తినట్టు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం డైరెక్టర్ సుదేశ్ కుమార్ మోఖ్తా తెలిపారు. కూలీలు వేసుకున్న రెండు టెంట్లు, ఓ జేసీబీ వరదలకు కొట్టుకుపోయినట్టు పేర్కొన్నారు.
ఓ యువకుడు స్వల్పంగా గాయపడ్డాడని, తొమ్మిది మంది కూలీల ఆచూకీ మాత్రం తెలియలేదని స్పష్టం చేశారు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపినట్లు సుదేశ్ తెలిపారు. రాష్ట్ర పోలీసులు, ఐటీబీపీ బృందాలు కలిసి సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఉద్ధృతంగా ఉన్న నీటి ప్రవాహం మంగళవారం రాత్రి సహాయక చర్యలకు అంతరాయం కలిగించిందని చెప్పారు.