కరోనా ఉధృతి కారణంగా సరిహద్దులు మూసివేత, ఆంక్షలు, వరుస విపత్తులతో ఉత్తర కొరియా పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలో భయంకరమైన ఆహార కొరత ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. 2025 వరకు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరారు కిమ్.
ప్రస్తుతం ఉత్తర కొరియాలో డిమాండ్‌కు తగ్గ రీతిలో ఆహార పదార్థాల సరఫరా లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో ఆహార పదార్థాల ధరలు ఆకాశనంటున్నాయి. సహజ విపత్తులు, సరైన ప్రణాళిక లేకపోవడం, వ్యవసాయ పరికరాల కొరత వంటి తదితర కారణాల వల్ల ఆహార కొరత ఏర్పడిందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ.. దేశంలో ఏర్పడ్డ ఆహార కొరతకు దేశ వ్యవసాయ రంగమే కారణమన్నారు. ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలను అందించడంలో దేశ వ్యవసాయ రంగం పూర్తిగా విఫలయ్యిందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ సమస్య తీవ్ర ఉద్రిక్తంగా మారింది అని తెలిపారు. గత ఏడాది సంభవించిన టైఫూన్, కరోనావైరస్ మహమ్మారి, భారీ వర్షాలు ఉత్తర కొరియా ఆహార సంక్షోభానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఈ క్రమంలో కిమ్ జాంగ్ ఉన్ పార్టీ నేతలతో భేటీ అయి.. ఆహార కొరత గురించి చర్చించారు. ఈ గండం నుంచి గట్టెకాలంటే మరో మూడేళ్లు అనగా 2025 వరకు దేశ ప్రజలు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలని కిమ్ సూచించారు. ప్రస్తుతం ఉత్తర కొరియా 8,60, 000 టన్నుల ఆహార పదార్థాల కొరతతో ఇబ్బంది పడుతుంది.