పీరియడ్స్ మొదలయ్యే ముందు నుండి పూర్తయిన తర్వాత వరకు యుటెరస్ భాగంలో ఉండే కండరాలు అన్నీ ఒత్తిడికి గురవుతాయి. ఈ విధంగా బ్లీడింగ్ జరుగుతుంది. అలాంటి సమయంలో కండరాలపై ఒత్తిడి కలగడం వల్ల నొప్పి కలుగుతుంది. కాకపోతే అందరిలో పీరియడ్ సైకిల్ ఒకే విధంగా ఉండదు. అందువల్ల నొప్పి కూడా ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటుంది.
కొంత మంది తెలిసీతెలియకుండా పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే పీరియడ్స్ సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల నొప్పి ఎక్కువ అవుతుంది మరి కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల నొప్పి తక్కువ అవుతుంది. ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరి స్థితి వేర్వేరుగా ఉంటుంది. చాలామంది పీరియడ్స్ సమయంలో పుల్లటి ఆహార పదార్థాలను తినడం వల్ల కడుపునొప్పి ఎక్కువగా ఉంటుందని, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని పుల్లటి ఆహార పదార్థాలను తినకూడదు అని చెప్తూ ఉంటారు.
కానీ అసలు నిజం ఏమిటో డాక్టర్ వివరించారు. ఎన్నో అపోహలు మనం తరచుగా వింటూ ఉంటాం అయితే లాజికల్‌గా ఆలోచిస్తే యూట్రస్ భాగంలో ఎటువంటి టేస్ట్ బడ్స్ ఉండవు. కాబట్టి పీరియడ్స్ సమయంలో పుల్లటి ఆహార పదార్థాలు తినడం వల్ల కడుపునొప్పి వంటివి ఎక్కువ అవ్వవు అని డాక్టర్ తనయ గారు చెప్పారు. మీరు పుల్లటి ఆహార పదార్థాలు తీసుకున్నా లేక తీసుకోకపోయినా పీరియడ్ క్రామ్ప్స్ అదే విధంగా ఉంటాయి. ఒకవేళ మీకు పుల్లటి పదార్థాలు తినాలనిపిస్తే పచ్చళ్ళు, నిమ్మకాయ మరియు పుల్లటి చాక్లెట్లను తినండి దీనివల్ల మీరు సంతోషంగా మరియు కంఫర్టబుల్‌గా ఉండగలుగుతారు.
చాలామందికి పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, తలనొప్పి, వికారం, కళ్ళు తిరగడం మరియు మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీ ఆరోగ్య విషయం బాగుండాలంటే పీరియడ్స్ సమయంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవడం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దాని వల్ల బాడీపెయిన్స్, నీరసం మరియు అలసిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పాలకూర వంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరగడానికి సహాయ పడతాయి. పైగా ఆకు కూరల్లో ఐరన్‌తో పాటు ఎన్నో పోషక విలువలు ఉండడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
పీరియడ్స్ సమయంలో కాఫీ తీసుకోవడం వల్ల తలనొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాఫీకి బదులుగా అల్లం టీ తాగండి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దానివల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది మరియు ముఖ్యంగా వికారం, వాంతులు వంటివి కూడా రాకుండా ఉంటాయి. అయితే ఒక రోజుకు నాలుగు గ్రాములు అల్లం కంటే ఎక్కువగా తీసుకోకూడదు.
సాధారణంగా పీరియడ్స్ సమయంలో చాక్లెట్‌ను తినమని అందరూ చెబుతూ ఉంటారు. అయితే పీరియడ్ సైకిల్లో డార్క్ చాక్లెట్ మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డార్క్ చాక్లెట్లలో అధిక శాతం ఐరన్ మరియు మెగ్నీషియం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో మాత్రమే డార్క్ చాక్లెట్ ఉపయోగపడుతుందంటే పొరపాటే. పీఎస్ సమస్యకు సంబంధించిన లక్షణాలు కనబడినా డార్క్ చాక్లెట్‌తో నివారించుకోవచ్చు.
అన్నిరకాల ఆహార పదార్థాలతో పాటు తాజా పండ్లు మరియు నట్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ నీరు ఉండేటువంటి పండ్లు కు ప్రాధాన్యత ఇవ్వండి. ఉదాహరణకు పుచ్చకాయ మరియు కీర దోస. కొంత మంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో తీయటి ఆహారపదార్థాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే అలా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటప్పుడు తియ్యగా ఉండేటువంటి పండ్లు తీసుకోవడం వల్ల తియ్యటి క్రేవింగ్స్ తగ్గుతాయి మరియు శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
ఇష్టమైన ఆహారాన్ని మరియు తినాలనుకునే ఆహారాన్ని వండుకోవడానికి సమయం లేకపోవడం వల్ల మార్కెట్లో దొరికే జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తినడం జరుగుతుంది. దాని వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉప్పు మరియు కారంను ఉపయోగిస్తారు. వాటి వల్ల కడుపు నొప్పి, వాంతులు వంటి జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయం లో ఇటువంటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని గుర్తుంచుకోవాలి.
పీరియడ్స్ సమయం లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ శరీరంలో పై చాలా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్ కు గురి చేస్తుంది. దాని వల్ల తలనొప్పి, కళ్ళు తిరగడం మరియు వికారం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటితో పాటు జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాలు తీసుకోవడం తగ్గించండి.
ఇటువంటి జాగ్రత్తలు పాటించడంతో పాటు మీ శరీరానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయో, ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అటువంటి ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. కాబట్టి పీరియడ్స్ సమయం లో నిపుణులు చెప్పిన ఈ విధంగా అనుసరించండి. ఇలా చేస్తే ఏ సమస్యలూ వుండవు అదే విధంగా ఆరోగ్యంగా ఉండచ్చు కూడా.