అగ్రరాజ్యం చరిత్రలో మొట్టమొదటి సారిగా స్పీకర్‌ను పదవి నుంచి తొలగించారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థీని బలవంతంగా పదవి నుంచి దించేశారు. ఇలా ఓ స్పీకర్‌ను బలవంతంగా పదవి నుంచి దించేయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.
కెవిన్‌కు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ నేత మ్యాట్ గేజ్ అవిశ్వాస తీర్మానం తీసుకురాగా.. దీనిపై ఓటింగ్ చేపట్టి మెకార్థీని తొలగించారు. సుదీర్ఘ ఓటింగ్ తర్వాత ఈ ఏడాది జనవరిలోనే మెకార్థీ స్పీకర్ పదవి చేపట్టగా.. 10 నెలలు తిరగకుండానే ఆయన ఉద్వాసనకు గురవ్వడం గమనార్హం.
గతేడాది జరిగిన ఎన్నికల్లో అమెరికా స్పీకర్‌ను ఎన్నుకోవడానికి రిపబ్లికన్లు ఆపసోపాలు పడ్డారు. ఏకంగా నాలుగు రోజుల పాటు 15 దఫాలు ఓటింగ్ నిర్వహించి చివరకు కెవిన్‌ను ఎన్నుకున్నారు. అయితే ఓటింగ్ సమయంలో కెవిన్ మెకార్థీ.. పదవిని చేజిక్కించుకోవడం కోసం పార్టీ నేతలతో ఓ ఒప్పందం చేసుకున్నారు. తనను ఆ పదవి నుంచి తొలగించడానికి.. ఒక్క రిపబ్లికన్ సభ్యుడు డిమాండ్ చేసినా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు సమ్మతిస్తానన్న ఒప్పందంలో పేర్కొన్నారు . ఇప్పుడదే ఒప్పందంతో మెకార్థీపై రిపబ్లికన్ నేత మ్యాట్ గేజ్ అవిశ్వాసం తీసుకొచ్చారు.