పంజాబ్ రాజకీయ రగడ ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అమరీందర్ సింగ్ అసహనంతో ఉన్నారు. పార్టీని పల్లెత్తు మాట అనని రాజకీయ దురంధరుడు హస్తం వీడి కమలం గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలోనే అమరీందర్ సింగ్ ఢిల్లీకి వెళ్లడం కలకలం రేపుతోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అనంతరం పార్టీలో చేరతారని సమాచారం.ఈ పరిణామంతో పంజాబ్ రాజకీయం మరింత వేడెక్కింది.
అయితే అమరీందర్ సింగ్ బీజేపీలో చేరితే మాత్రం కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విబేధాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు, అమరీందర్ సింగ్‌కు అసలు పొసగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ విబేధాలు కొనసాగుతున్నాయి. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం మధ్యే మార్గంగా అమరీందర్‌సింగ్‌ను దింపేసి దళిత వర్గానికి చెందిన చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది.
అయితే ఈ నిర్ణయం ఎవరికీ ఆమోదయోగ్యంగా లేదు. పార్టీ నిర్ణయం మేరకు సిద్ధూ అంగీకరించినా మాజీ ముఖ్యమంత్రిగా మారిన అమరీందర్ సింగ్ మాత్రం జీర్ణించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పిన అమరీందర్ సింగ్ పార్టీ అధిష్టానం పిలిచి సముదాయించలేదు. పిలిచి మాట్లాడకపోవడం.. అసలు పట్టించుకోకపోవడంతో ఆయన తన దారి చూసుకుంటున్నారని సమాచారం. కొన్ని గంటల్లో ఏం జరగనుందో తెలియనుంది.