తీహార్‌ జైలు నుంచి ముఖ్యమంత్రి విడుదల

తీహార్‌ జైలు నుంచి ముఖ్యమంత్రి విడుదల

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా శుక్రవారం తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలా పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2000 సంవత్సరంలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2013లో చౌతాలా అరెస్టయ్యారు.

అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసిన వారికి 6నెలలు మినహాయింపును ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయంతో ఓం ప్రకాశ్‌ చౌతాలాకు ఆరు నెలల మినహాయింపు లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడుగా ఓం ప్రకాశ్‌ చౌతాలా ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా 4 సార్లు పదవి నిర్వహించిన విషయం తెలిసిందే.