అజాక్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు డైరెక్టర్ హోదాలో ఉన్న మాజీ ఫుట్‌బాలర్ మార్క్ ఓవర్‌మార్స్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉన్నతస్థానంలో ఉంటూ మహిళలకు అసభ్యకర సందేశాలు పంపాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన డచ్‌క్లబ్ ఓవర్‌మార్స్‌ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించడమే గాక తాత్కాలిక నిషేధం విధించింది. కాగా నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ ఓవర్‌మార్స్ 11 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడడంతో పాటు 1992-97 మధ్య కాలంలో అజాక్స్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.
గత కొద్దిరోజులుగా మార్క్.. తనతో ఏకాంతంగా గడపాలంటూ తనతో పాటు పనిచేస్తున్న మహిళలకు అసభ్యరీతిలో సందేశాలు పంపాడు. మొదట ఇందులో నిజం లేదని కొట్టిసారేసినప్పటికి.. మెసేజ్‌లు వచ్చిన మహిళలు వాటిని బయటపెట్టడంతో మార్క్ బాగోతం బయటపడింది. కాగా 2012లో తొలిసారి అజాక్స్‌కు తొలిసారి డైరెక్టర్ అయ్యాడు. ఇటీవలే మరోసారి అజాక్స్ ఫుట్‌బాల్ డైరెక్టర్‌గా తిరిగి ఎంపికయిన మార్క్.. 2026, జూన్ 30 వరకు పదవిలో కొనసాగాల్సింది.
తనపై వచ్చిన ఆరోపణలపై మార్క్ ఓవర్‌మార్స్ స్పందించాడు. ”నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా. మహిళలకు అసభ్య సందేశాలు పంపినప్పుడు ఇలా జరుగుతుందని భావించలేదు. ఏది ఏమైనా నేను చేసింది తప్పు. నాపై యాక్షన్ తీసుకోవడం సరైనదే.. ఏ శిక్షకైనా సిద్ధం” అంటూ క్షమాపణ కోరాడు.