కేరళలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోచి సమీపంలోని వైట్టిల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్ , రన్నరప్ అంజనా షాజన్ దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద సమయానికి కారులో నలుగురు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వేగంగా వచ్చి తొలుత ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వీరి వాహనం.. అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. అన్సీ కబీర్, అంజనాలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు.
డ్రైవర్ మరో వ్యక్తి ప్రమాదంలో గాయాలతో బయటపడ్డారు. క్షత్రగాత్రులకు చికిత్స కోసం యర్నాకులం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే అన్సీ, అంజనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు భావిస్తున్నారు. డ్రైవర్ ఒక్కరే సీటు బెల్టు పెట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. అన్సీ స్వస్థలం తిరువనంతపురంలోని అట్టాంగిల్, అంజనాది త్రిస్సూర్. ఇరువురూ 2019 మిస్ కేరళ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అన్సీ కబీర్.. కాలేజీ రోజుల నుంచి మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. మిస్ బలబార్, లూలూ బ్యూటీ కంటెస్ట్ 2018లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. మిస్ కేరళ 2019 పోటీల్లో విజయం సాధించింది. ఆయుర్వేద వైద్యురాలైన అంజనాకు మోడలింగ్‌లో ఎటువంటి అనుభవం లేకపోయినా మిస్ కేరళ 2019 పోటీల్లో పాల్గొని, తుది వరకూ గట్టిపోటీ ఇచ్చి మొదటి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.