పాతకక్షల నేపథ్యంలో పట్టపగలే మాజీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ దుర్ఘటన రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారంగ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొర్రకూటి శ్రీనివాసరావు(50) పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో పోలేరమ్మగుడి వద్ద కాపు కాసి ఉన్న కుర్రా వీరనారాయణ ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. శ్రీనివాసరావు తలపై పలుమార్లు బలంగా మోదాడు. తీవ్రరక్తస్రావంతో శ్రీనివాసరావు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. ఆయనను స్థానికులు వెంటనే పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శ్రీనివాసరావు చికిత్సపొందుతూ మృతిచెందారు.
శ్రీనివాసరావు 2006 నుంచి 2011 వరకు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చురుగ్గా పనిచేశారు. ప్రస్తుతం ఈయన భార్య వెంకాయమ్మ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. వైఎస్సార్సీపీలో శ్రీనివాసరావు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఈయనకు దూరపు బంధువు వీరనారాయణతో పాతకక్షలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వీరనారాయణ శ్రీనివాసరావు వెన్నంటే తిరుగుతూ మంచిగా ఉంటున్నట్టు నమ్మించాడు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో కుమ్మక్కై హత్యకు పథక రచన చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పిడుగురాళ్ల రూరల్ సీఐ పి.ఆంజనేయులు, ఎస్ఐ కె.అమీర్ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.