పుల్వామా స్కెచ్ గీసిన టెర్రరిస్ట్ హతం…!

Four Army Personnel Martyred During Encounter In Pulwama

పుల్వామా ఆత్మాహుతి దాడిలో 49 మంది సైనికులు అమరులు కాగా, అనేక మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎన్‌కౌంటర్‌లో హతమైనవారిలో ఒకర్ని జైషే మహ్మద్‌ కమాండర్, పుల్వామా ఆత్మాహుతి దాడి సూత్రధారి అబ్దుల్ రషీద్ ఘాజీగా గుర్తించారు. ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడికి ఇతడే వ్యూహరచన చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఐఈడీ బాంబుల అమరికలో నిపుణుడైన ఘాజీ, పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్ అహ్మద్ దార్‌కు శిక్షణ ఇచ్చాడు. అఫ్ఘనిస్తాన్ యుద్ధంలోనూ పాల్గొన్న ఘాజీ, జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ కు అత్యంత నమ్మకస్తుడు. అతడికి కుడి భుజం లాంటి రషీద్, యుద్ధ నైపుణ్యాలు, ఐఈడీ బాంబుల తయారీలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటాడు. అయితే మరోపక్క ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్ ఉగ్రదాడి జరిగిన ఐదు కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. పింగ లాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నట్టు సమాచారం అందడంతో సైన్యం అక్కడకు చేరుకుని చుట్టిముట్టింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఆర్మీకి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, ఎస్‌ఓజీలు సంయుక్తంగా పాల్గొన్నాయి. సోమవారం తెల్లవారుజామున పింగలాన్ చేరుకుని తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో ఈ ఘటనలో ఓ మేజర్ సహా ఐదుగురు సైనికులు అమరులయ్యారు. మేజర్ డీఎస్ దోండియల్, హెడ్‌కానిస్టేబుల్ సవే రాం, జవాన్ అజయ్ కుమార్, హరిసింగ్‌లు ఎన్‌కౌంటర్ ప్రదేశంలోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన గుల్జార్ మహ్మద్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇదే ఎదురుకాల్పుల్లో ఇద్దరు స్థానికులు సైతం మృతిచెందారు. ఈ ఇద్దరూ తీవ్రవాదులు తలదాచుకున్న ఇంటి యజమానులు.