తెలంగాణలో కరెంట్ కాటుకు నలుగురు బలయ్యారు. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో దంపతులతో పాటు ఓ రైతు, కూలీ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో శుక్రవారం రాత్రి కరెంట్ షాక్‌తో భార్యభర్తలు ప్రాణాలు కోల్పోయారు.
జీకేపేట పంచాయతీలోని సింగారం-2 కాలనీకి చెందిన అనపర్తి తిరుపతమ్మ స్నానానికి వెళ్లొస్తూ టవల్‌ను ఇనుప తీగపై ఆరేసేందుకు ప్రయత్నించింది. అప్పటికే ఆ దండేనికి విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్ కొట్టి ఆమె కేకలు వేశారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో భర్త ఉపేందర్ కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వీరికి అయిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలున్నారు.
మహబూబాబాద్ మండలం సింగారం శివారు ఇస్లావత్‌తండా పంచాయతీ పరిధి వెంకట్రామ్ తండాకు చెందిన ధరావత్ హరిసింగ్ గురువారం సాయంత్రం చెరువు సమీపంలో విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందారు. వ్యవసాయ బావి మోటారును బంద్ చేసేందుకు వెళ్లి ఆయన ప్రమాదానికి గురయ్యారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకూషాపూర్‌లో సుమత అనే మహిళా కూలీ శుక్రవారం కరెంట్ షాక్‌తో మరణించారు. కార్తికపౌర్ణమి కావడంతో ఇంటిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు హీటర్‌కు చేయి తాకి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.