ప్రతి ఇంటికి ఉచిత కరెంట్

ప్రతి ఇంటికి ఉచిత కరెంట్

వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు విద్యుత్తును అస్త్రంగా మలుచుకున్నారు. అంతేకాదు, పెండింగ్ బిల్లుల రద్దు సహా విద్యుత్తు కనెక్షన్ పునరుద్ధరిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

చండీగఢ్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘కేజ్రీవాల్ హామీ ఇస్తున్నాడు.. కెప్టెన్ (పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్) ప్రతిజ్ఞ కాదు.. మా హామీలను నెరవేరుస్తాం.. ఐదేళ్లయిన కెప్టెన్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు’ అని ఢిల్లీ సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, దీని వల్ల పంజాబ్‌లోని 77 నుంచి 80 శాతం ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, 24 గంటల నిరంతరాయం కరెంట్‌ను మూడేళ్లలో నెరవేరుస్తామని హామీ కేజ్రీవాల్ ఇచ్చారు.

ఇక, 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రెండేళ్ల తర్వాత 2017లో జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల బరిలో ఆప్ దిగింది. 25 లక్షలు ఉద్యోగాలు, రూ.5 లకే భోజనం, ఉచిత వైఫై, పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలు, వృద్ధాప్యపు పింఛన్లు, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుతామని ఆప్ హామీలిచ్చిన ఓటర్లు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఆప్ కేవలం 20 సీట్లకు పరిమితమయ్యింది.

మొత్తం 117 స్థానాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 77 చోట్ల విజయం సాధించడంతో పదేళ్ల శిరోమణి అకాలీ దళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ముగింపు పడింది. అయితే, కాంగ్రెస్ తర్వాత ఎక్కువ స్థానాలను ఆప్ గెలుపొందడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. ఈసారి ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని ఆప్ భావిస్తోంది. విద్యుత్ బిల్లుల విషయంలో పంజాబ్‌వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి ఉందని కేజ్రీవాల్ అన్నారు.

కొన్నిసార్లు ఆదాయంలో 50 శాతం విద్యుత్ బిల్లులకే సరిపోతుందని కొందర మహిళలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.‘‘రెండు బల్బులు, ఒక ఫ్యాన్ ఉన్న కుటుంబానికి నెలకు రూ.50,000 బిల్లు వస్తోంది.. ఇదెలా సాధ్యం.. ఇది తక్షణ ప్రభావంతో ముగుస్తుంది.. అంతే కాదు, అన్ని పాత బకాయిలు, పెండింగ్ లేదా బకాయి బిల్లులు రద్దు చేస్తాం.. ఆ బిల్లులను ఎవరూ చెల్లించాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.