ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల హామీలో ప్రకటించినట్లుగానే బిహార్ వాసులందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ స్పష్టం చేశారు. అయితే వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులను ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రమవుతున్నందున బిహార్ వాసులంతా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కాగా సోమవారం నాటికి రాష్ట్రంలో 5051 యాక్టివ్ కేసులుండగా, కరోనా రికవరీ రేటు 97.25 శాతంగా ఉందని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే బిహార్‌లో పరిస్థితులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు.
కరోనా కట్టడి నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో విధించిన జరిమానాలపై స్పందిస్తూ.. బిహార్‌లో జరిమానా పెంచాల్సిన అవసరం లేదని, దీనికి ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అందుకు ప్రజల మద్దతు లేకపోతే ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. కరోనా సెకండ్‌వేవ్ ఉంటుందన్న దానిపై కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు.