ఉచిత తాగునీటి పథకం

ఉచిత తాగునీటి పథకం

గ్రేటర్‌ పరిధిలో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం పొందేందుకు గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ జలమండలి నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ పరిపాలన శాఖ ఆదేశంతో ఈ వెసులుబాటు కల్పించింది. వినియోగదారులు తమ నల్లాలకు నూతన మీటర్‌ను ఏర్పాటు చేసుకోవడం, కనెక్షన్‌ నంబరుకు ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 వరకు నీటిబిల్లుల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక అపార్ట్‌మెంట్లలోనూ ప్రతి ఫ్లాట్‌ వినియోగదారుడూ నల్లా క్యాన్‌ నంబరుకు ఆధార్‌ నంబరును జత చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అనుసంధానం పూర్తయిన వారికే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేసుకోని పక్షంలో సదరు వినియోగదారులకు డిసెంబరు-2020 నుంచి ఆగస్టు-2021 మధ్యకాలానికి నీటిబిల్లు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఆధార్‌ అనుసంధానానికి సమీప మీ సేవ కేంద్రాల్లో, లేదా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.హైదరాబాద్‌ వాటర్‌జీఓవీ.ఐఎన్‌ సైట్‌ను, ఇతర వివరాలకు కస్టమర్‌ కేర్‌ నంబరు 155313ని సంప్రదించాలని సూచించింది.