గత కొద్దిరోజులుగా రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్ పోటీలు నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ తో పూర్తి అయింది. జీవితకాలంలో అత్యంత అరుదుగా దక్కే అవకాశాన్ని రెండుచేతులా ఒడిసి పట్టుకున్న ఫ్రెంచ్ యువ సైన్యం విశ్వవిజేతగా ఆవిర్భవించింది. స్టార్ ఆటగాళ్లంతా మూకుమ్మడిగా దాడికి దిగడంతో తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన చిన్న దేశం క్రొయేషియా తట్టుకోలేకపోయింది. 4-2 తేడాతో ఆ జట్టును మట్టికరిపించింది.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రథమార్ధంలో క్రొయేషియా జట్టు రెండు గోల్స్ సాధించినా నిజానికి అవి ప్రత్యర్థి జట్టు ‘దయ’తో వచ్చినవే కానీ ఆ తర్వాతే అసలైన సమరం ఆరంభమైంది. ఫస్ట్ హాఫ్‌లో ప్రత్యర్థి జట్టు గోల్‌పోస్ట్‌పై క్రొయేషియా ఏడుసార్లు దాడిచేసింది. ముప్పేట దాడికి దిగిన ఫ్రాన్స్ వెంటవెంటనే పోగ్బా, ఎంబప్పే ద్వారా మెరుపులాంటి గోల్స్‌తో గుక్కతిప్పుకోకుండా చేసింది. దీంతో రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న సాకర్ కప్ ను దక్కించుకున్న ఫ్రాన్స్ ఆటగాళ్లు.. భారీ వర్షంలో తడుస్తూ తనివితీరా సంబరాలు చేసుకున్నారు.