చనిపోయాడనుకున్న యువకుడు బ్రతికాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో.. ఆ యువకుడిలో కదలికలు వచ్చాయి. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. యూపీకి చెందిన మహ్మద్ ఫర్ఖాన్(20) జూన్ 21వ తేదీన రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ ఆస్పత్రి యాజమాన్యం రూ. 7 లక్షలు తీసుకొని వైద్యం చేశారు. ఇంకా డబ్బులు కావాలని ఆస్పత్రి యాజమాన్య డిమాండ్ చేయడంతో.. తమ వద్ద డబ్బులు లేవని ఫర్ఖాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఫర్ఖాన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఫర్ఖాన్ను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువచ్చారు. ఇక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే ఫర్ఖాన్ శరీరంలో కదలికలు రావడంతో.. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. బతికుండగానే చనిపోయాడని నిర్ధారించిన ప్రయివేటు ఆస్పత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ నరేంద్ర అగర్వాల్ స్పష్టం చేశారు.