ఏపీ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయం అయిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో గతంలో హైదరాబాద్ నుంచి అసెంబ్లీ తరలింపు సందర్భంగా కొంత ఫర్నిచర్‌తో పాటు కొన్ని ఏసీలు మాయం అయినట్టు తాజాగా తేలింది. కోడెల స్పీకరుగా ఉన్నప్పుడే ఇది జరిగిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.
దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అసెంబ్లీకి వచ్చి పూర్తి వివరాలు ఆరా తీశారు. ఇటీవల అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం నుంచి పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే ఇప్పటివరకూ దీనిపై కేసు నమోదు కాలేదు.
మరోవైపు అసెంబ్లీకి సంబంధించిన విలువైన ఫర్మిచర్, ఏసీలను సత్తెనపల్లి, నరసరావుపేట తరలించారని బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రచ్చ సాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి.
కే ట్యాక్స్ పేరుతో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబసభ్యులు వసూళ్లు, బెదిరింపులకు పాల్పడ్డారని అనేక మంది కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఫర్నీచర్ మాయం కావడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.