రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పై టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు. ఎనిమిదేళ్ల నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లి ఒక్క సారి కూడా జట్టుకు టైటిల్ అందించలేదని అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన బాధ్యతను స్వీకరించే సమయం ఆసన్నమైందని గంభీర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఐపీఎల్‌లో గొప్ప ప్రదర్శనలు చేస్తూ జట్టుకు టైటిల్స్ అందించిన కారణంగానే ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు సుదీర్ఘ కాలంగా కెప్టెన్లుగా ఉన్నారని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇదే ఎనిమిదేళ్ల వైఫల్యానికి సీఎస్‌కే, ముంబై జట్ల యాజమాన్యాలు ధోని, రోహిత్‌లను కెప్టెన్సీ నుంచి ఎప్పుడో తొలిగించేదని గంభీర్ నొక్కిచెప్పాడు.
‘రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఏం జరిగిందో చూడండి. రెండేళ్లకు పంజాబ్ అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. జట్టును విజయ పథంలో నడిపించ లేకపోయాడని తొలగించింది. ధోని సారథ్యంలో సీఎస్‌కే మూడు టైటిల్స్, రోహిత్ కెప్టెన్సీలో ముంబై నాలుగు టైటిల్స్ గెలుచుకుంది. సెప్టెంబర్ 28 న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అదృష్టంగా కొద్దీ సూపర్ ఓవర్‌లో గెలిచింది. లేదంటే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించేది కాదు’అని గంభీర్ పేర్కొన్నాడు.
ఇక శుక్రవారం సన్‌రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఓపెనర్‌గా రావడం బెడిసి కొట్టిందని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచిన వార్నర్ సేన క్వాలిఫైయర్-2 లో ఢిల్లీతో తలపడనుంది. సీజన్ మొదటి నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.