కరోనా ప్రభావం లేకపోవడంతో న్యూజిలాండ్‌లో అతి సాధారణ పరిస్థితుల్లో జరిగిన క్రీడలు మళ్లీ నిబంధనల చట్రంలో ఇరుక్కున్నాయి. ఆక్లాండ్‌లో తాజాగా నాలుగు పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని జసిండా ఆడెర్న్ ప్రకటించారు. కేసులు బయటపడిన ఆక్లాండ్‌లో లెవల్–3 లాక్డౌన్, మిగతా ప్రాంతాల్లో లెవల్–2 లాక్డౌన్ బుధవారం నుంచి 72 గంటల పాటు ఉంటుందని ఆమె వెల్లడించారు. దీంతో ఈ వారాంతంలో జరగనున్న సూపర్ రగ్బీ చివరి రౌండ్ పోటీల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.
ఆక్లాండ్‌లో ఆదివారం బ్లూస్, క్రూసేడర్స్ మధ్య జరుగనున్న మ్యాచ్‌ను దాదాపు 43,000 మంది ప్రత్యక్షంగా వీక్షించే అవకాశముంది. లెవల్–3 నిబంధనల ప్రకారం ప్రధాన క్రీడా టోర్నీలు నిర్వహించేందుకు అనుమతి లేదు. ఒకవేళ ఆక్లాండ్‌లో లాక్‌డౌన్‌ను వారాంతానికి పొడిగిస్తే ఈ మ్యాచ్‌కూ ఆటంకం కలగవచ్చు. లెవల్–2 ప్రాంతాల్లో ప్రేక్షకులు లేకుండా టోర్నీలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. జూన్ 14న జరిగిన ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఆక్లాండ్‌లోని ఈడెన్‌పార్క్‌లో బ్లూస్, హారికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను 40,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. 102 రోజుల తర్వాత న్యూజిలాండ్‌లో మళ్లీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.