తిరుపతిలో పాత కక్షలు భగ్గుమన్నాయి. నగరంలోని ఐఎస్ మహల్ వద్ద ఆదివారం రాత్రి రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని గిరిపురానికి చెందిన దినేష్(35) ట్యాక్సీ నడుపుతూ జీవన సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటికి వెళుతుండగా ఐఎస్ మహల్ సమీపంలోని హారిక బార్ వద్ద గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి పారిపోయారు.
తీవ్రంగా గాయపడిన దినేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. అర్భన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే అతనిపై వెస్ట్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదై ఉంది. బెల్టు మురళి హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడని, పాత కక్షలే హత్యకు దారి తీసి ఉంటాయని తెలిపారు. నిందితులను త్వరగా పట్టుకొవాలని వెస్ట్ సీఐ శివప్రసాద్‌ను ఆదేశించారు.