ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

హథ్రాస్‌ దారుణం మరువకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. అక్కడితో ఊరుకోక బాధితురాలి ఊపిరితిత్తులను బయటకు తీసి వాటితో క్షుద్ర పూజలు నిర్వహించారు. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం యూపీలోని ఘతంపూర్‌లో ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు.. మరణించిన చిన్నారి దీపావళి పండుగ నాటి సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది.

కుటుంబ సభ్యులు పండుగ హడావుడిలో ఉండగా.. బాలిక టపాకుల కోసం బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలన్ని గాలించారు. సమీపంలో ఓ అడవి ఉంటే అక్కడ కూడా వెతికారు. కానీ చీకటి పడటంతో సరిగా కనపడలేదు. ఆదివారం ఉదయం అడవి గుండా వెళ్తున్న కొందరికి అత్యంత దారుణ స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. కొద్ది దూరంలో ఓ చెట్టు దగ్గర బాలిక చెప్పులు, బట్టలు కనిపించాయి. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంకుల్‌ కుర్లి, బీరన్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

ఇక పోలీసుల దర్యాప్తులో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. తమ బంధువు పరశురామ్‌ అనే వ్యక్తి సంతానం లేక బాధపడుతున్నాడని తెలిపారు. పిల్లల కోసం తాంత్రిక పూజ చేసేందుకు నిర్ణయించాడు. ఇందుకు గాను ఓ చిన్నారిని బలి ఇవ్వాలని భావించాడు. దీని గురించి బంధువులు అంకుల్‌ కుర్లి, బీరన్‌లకు తెలిపాడు. పరుశురామ్‌కు సాయం చేయాలని భావించిన నిందితులు శనివారం టపాకులు కొనడానికి బయటకు వచ్చిన చిన్నారిని కిడ్నాప్‌ చేసి సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి చంపేసి.. ఆమె ఊపిరితిత్తులను బయటకు తీసి పరశురామ్‌కు ఇచ్చారు.

దాంతో అతడు తాంత్రిక పూజ నిర్వహించాడు. నిందితుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పరశురామ్‌, అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. తొలుత అతడు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు తమ స్టైల్లో విచారించేసరికి నేరం ఒప్పుకున్నాడు. ఇక విచారణంలో పరశురామ్‌ తనకు 1999లో వివాహం అయ్యింది కానీ ఇంతవరకు సంతానం లేకపోవడంతో తాంత్రిక పూజలు నిర్వహించానని.. అందులో భాగంగానే చిన్నారిని కిడ్నాప్‌ చేయాల్సిందిగా బంధువులు అంకుల్‌, బీరాన్‌లను కోరానని తెలిపాడు. పోలీసులు నిందితుల మీద పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ దారుణాన్ని తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితులకు త్వరగా శిక్ష పడటం కోసం కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.