ఉత్తర్ ప్రదేశ్లోని హత్రాస్ ప్రాంతంలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్రాస్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో ఉన్న ఆ యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. ఈ ఘటన సెప్టెంబర్ 14న చోటుచేసుకున్నా ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమె శరీరంపై చాలా గాయాలున్నాయని.. నాలుకను కూడా కోసినట్లు యువతిని పరీక్షించిన డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా యువతి పరిస్థితి విషమంగా ఉందని సౌకర్యాలున్న పెద్దాసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉందని సూచించారు. యువతి షెడ్యూల్ కులానికి చెందినది కావడం.. అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు అగ్రవర్ణ కులానికి చెందినవారు కావడంతోనే మొదట పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. అయితే యువతి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులు తొలుత తమకు సహకరించలేదని.. ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని యువతి సోదరుడు ఆరోపించారు.
యువతి సోదరుడు మాట్లాడుతూ.. నా సోదరి తల్లితో పాటు పొలం పనులు చేయడానికి వెళ్లింది. మా పెద్దన్న అప్పటికే గడ్డి కోసుకొని ఇంటికి వచ్చాడు. అయితే గడ్డంతా ఏపుగా పెరగడంతో మా అమ్మ, చెల్లి దానిని కోసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మా చెల్లి పొలం పనులు చేస్తుండగా నలుగురు యువకులు వచ్చి ఆమె తలకు ఉన్న దుప్పటను లాగి మెడకు చుట్టి అక్కడినుంచి లాక్కెల్లారు. ఆ తర్వాత ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డ ఆ నలుగురు ఆమెపై దాడి చేసి తమ పేర్లు ఎక్కడ బయటపెడుతుందోనని బయపడి నాలుకను కోసేశారు. నా చెల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డవారు మా ఊరి యువకులే అని తర్వాత తెలిసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ యువతి సోదరుడు ఆవేదనతో పేర్కొన్నాడు.