రాజస్థాన్లో దారుణం జరిగింది. ఓ మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే.. అల్వార్ జిల్లాలోని టిజారా పోలీస్ స్టేషన్ పరిధిలో 45 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గురువారం పోలీస్ కేసు నమోదైంది. ఈ ఘటనపై డీఎస్పీ టిజారా కుషల్సింగ్ను సంప్రదించగా.. ‘ఓ వివాహిత తన మేనల్లుడితో కలిసి వేరొకరికి డబ్బులు ఇవ్వడానికి వెళ్లారు. అనంతరం వారు తమ పనులు ముగించుకొని తిరిగొస్తుండగా.. ఓ కొండపై ఆరుగురు వ్యక్తులు వారిని ఆపారు.
అనంతరం మేనల్లుడిపై విచక్షణారహితంగా దాడి చేసి, వివాహితపై వారు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే వారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేశారు. జరిగిన ఘటనను బాధిత మహిళ తన భర్తకు వివరించగా.. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేయగా.. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీఎస్పీ కుషల్ సింగ్ తెలిపారు.