తుదిశ్వాస‌వ‌ర‌కు దావూద్ తోనే ఉంటానన్న ఛోటా ష‌కీల్

gangster-chhota-shakeel-den

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తుదిశ్వాస ఉన్నంత వ‌ర‌కు దావూద్ ఇబ్ర‌హీంతో క‌లిసే ఉంటానంటున్నాడు ఛోటా ష‌కీల్. కరాచీలో ఉంటున్న దావూద్ తో ఛోటా ష‌కీల్ కు విభేదాలు వ‌చ్చాయ‌ని వార్త‌లొస్తున్న నేప‌థ్యంలో గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఓ జాతీయ న్యూస్ చాన‌ల్ తో మాట్లాడాడు ఛోటా ష‌కీల్. దావూద్ భాయ్ తో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని, ఆఖ‌రి శ్వాస వ‌ర‌కూ అత‌నితో ఉంటాన‌ని స్ఫష్టంచేశాడు. అండ‌ర్ వ‌ర‌ల్డ్ లో డీ కంపెనీ కోస‌మే పనిచేస్తాన‌ని తెలిపాడు. దావూద్ తో గొడ‌వ‌లు వ‌చ్చాయ‌న‌డం కేవ‌లం పుకార్లే అన్నాడు.

డీ గ్యాంగ్ లో ఛోటా ష‌కీల్ ను దావూద్ కు కుడి భుజంగా భావిస్తారు. అయితే ఇటీవ‌ల గ్యాంగ్ లో దావూద్ సోద‌రుడు అనీస్ పాత్ర పెర‌గ‌డంతో… చోటా ష‌కీల్ దావూద్ కు దూర‌మ‌య్యాడ‌ని, దావూద్ తో మాట్లాడ‌టానికి కూడా ష‌కీల్ ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని, క‌రాచీలో విడిగా ఉంటున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. అయితే దావూద్ ను, చోటా ష‌కీల్ ను క‌లిపేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేసింద‌ని తెలుస్తోంది. 1993 ముంబై పేలుళ్ల‌కేసు ప్ర‌ధాన‌నిందితుడ‌యిన దావూద్ ఇబ్ర‌హీం…భార‌త్ నుంచి వెళ్లిపోయి… పాకిస్థాన్ లో స్థావ‌రం ఏర్ప‌రుచుకున్నాడు. క‌రాచీ కేంద్రంగా త‌న అండ‌ర్ వ‌ర‌ల్డ్ సామ్రాజ్యాన్ని విస్త‌రించాడు. ప్ర‌పంచంలో సంప‌న్న నేర‌గాళ్ల‌లో దావూద్ రెండో స్థానంలో ఉన్నాడు.

ముంబై పేలుళ్ల కేసు విచార‌ణ కోసం దావూద్ ను అప్ప‌గించాల‌ని భార‌త్ ఎప్ప‌టినుంచో కోరుతోంది. పాక్ మాత్రం దావూద్ త‌మ దేశంలో లేడ‌ని అబ‌ద్ధం చెబుతోంది. అయితే దావూద్ అనారోగ్యంతో ఉన్నాడ‌ని, చివ‌రిరోజులు భార‌త్ లో గ‌డ‌పాల‌నుకుంటున్నాడ‌ని కొన్నిరోజుల క్రితం వార్త‌లొచ్చాయి. ఇటీవ‌ల‌ థానే పోలీసులు అరెస్టు చేసిన దావూద్ సోద‌రుడు ఇబ్ర‌హీం క‌స్క‌ర్ మాత్రం ఈ వార్త‌లను ఖండించాడు. దావూద్ కు భార‌త్ వ‌చ్చే ఉద్దేశం లేద‌ని, ఒక‌వేళ అత‌నికి ఆ ఉద్దేశం ఉన్నా ఐఎస్ ఐ అందుకు ఒప్పుకోద‌ని స్ప‌ష్టంచేశాడు.