గంటా వెళ్ళింది స్వామి కార్యానికా, స్వకార్యనికా ?

Ganta Srinivas meets Anam Ramanarayana Reddy

టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు గత కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం మీద అలిగారని ఒక పత్రిక (తెలుగుదేశానికి సపోర్ట్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి) – మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిసి చేయించిన సర్వేలో గంటా పని తీరు బాలేదని సదరు సర్వే తేల్చడంతోనే ఆయన అలకపాన్పు ఎక్కారని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఆయన టీడీపీ కాబినెట్ సమావేశానికి కూడా హాజరుకాకాకపోవడంతో ఈ వ్యాఖ్యలకి బలం చేకూరింది. అయితే ఇటువంటి విషయాలు ముందే పసిగట్టే బాబు తన దూతగా డిప్యూటీ సిఏం ను పంపి గంటాను బుజ్జగించారు, దాంతో అప్పటికి గంటా అలక వీడారు.

తొలుత చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో కీలకపాత్ర వహించి ఆ తరువాత కాంగ్రెస్ లోకి, ఆపై ప్రస్తుతం టీడీపీ లోకి గంటా జంప్ అయ్యారు. ఆయన కుమారుడి చిత్ర రంగప్రవేశం విషయమై చిరంజీవి నేతృత్వంలోనే జయంత్ సి ఫర్జానీ లాంటి నాటి టాప్ డైరెక్టర్ తో అరంగేట్రం చేయించారు. మొదటినుండి చిరంజీవి కుటుంబానికి మంచి సన్నిహితులనే విషయం తెలిసిందే. అలాగే ఇటీవల ప్రజాపోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా విశాఖ జిల్లా లో ప్రవేశించే సమయంలో భీమిలి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అయన పర్యటన తాలూకు కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించింది గంటా అనుచరులేనని అప్పట్లో వార్తలు కూడా వెలువడ్డాయి. అదేమీ లేదని గంటా కొట్టి పారేశారు.

అయితే ఇప్పుడు తన మీద తప్పుడు సర్వేలు నమ్ముతున్నారని అలక పాన్పు ఎక్కినా గంటా, తను పట్టిన్చుకోవడంలేదని టీడీపీ మీద గుర్రుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డిని కలవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబే ఆనంను బుజ్జగించమని గంటాని పంపారని చెబుతున్నా ఆనం కూడా పార్టీ మారే విధంగా పావులు కదుపుతున్నారని, ఈ సమయంలో గంటాతో సహా ఆయన కూడా బయటకు వెళ్లనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చిరంజీవి మాదిరి, జనసేన అధినేత పవన్ తో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉండడంతో ఎన్నికల వేళ జనసేన తీర్థం పుచ్చుకుని ముచ్చటగా మూడు పార్టీలు మార్చేసి నాలుగో పార్టీలోకి గృహ ప్రవేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి. పవన్ ఆలోచనలకు కార్యరూపమించేలా గంట వంటి సీనియర్లు జనసేనకు అవసరమని, అంతా కొత్త నాయకులే కావాలంటే అయ్యే పని కాదని అందుకే పవన్ కూడా ఆయనకు మొగ్గు చూపుతున్నట్లు చెపుతున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ, రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.