జీడీపీ లెక్కలు బాగానే ఉన్నాయంటూ కేంద్రం శుభవార్త చెప్పిన మరుసటి రోజు సామాన్యుడికి షాక్ తగిలింది. ఎల్‌పీజీ గ్యాస్ ధరను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.884.50కి చేరుకుంది.ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి గ్యాస్ ధరలను చమురు కంపెనీలు సమీక్షిస్తున్నాయి.
అందులో భాగంగా మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలను స్థిరీకరిస్తున్నాయి. చివరి సారిగా ఆగస్టు 18న గ్యాస్ ధరను రూ. 25 పెంచాయి. రెండు వారాలు తిరిగే సరికి మరోసారి సామాన్యుడి నెత్తిన గ్యాస్ పిడుగు పడింది. దీంతో రెండు వారాల వ్యవధిలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 వరకు పెరిగింది.
ఈ ఏడాది ఆరంభంలో రూ.694లుగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో, మార్చి, జూన్‌లలో కూడా ధరలను చమురు కంపెనీలు పెంచాయి. మొత్తంగా ఐదు సార్లు ధర పెరగగా మధ్యలో ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో కొద్ది మేరకు ధరలను తగ్గించాయి. మొత్తంగా ఈ ఏడాది 14.2 కేజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.165.50 వరకు ధర పెరిగింది.
పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. తాజా పెంపుతో దేశంలో 29.11 కోట్ల మంది ఎల్‌పీజీ కస్టమర్లపై భారం పడనుంది.