అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన టీమిండియా ఫాస్ట్‌బౌలర్ హర్షల్ పటేల్‌పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో హర్షల్ పటేల్ అరంగేట్రం చేశాడు. తొలి టీ20లో గాయపడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ జట్టులోకి వచ్చాడు. డెబ్యూ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్ పటేల్ 25 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో హర్షల్ తన తొలి మ‍్యాచ్ ఆడుతున్నట్లు కనించలేదని, అనుభవజ్ఞుడులా బౌలింగ్ చేశాడిని గంభీర్ తెలిపాడు. సుదీర్ఘకాలం పాటు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో ఆడడం అతడికి ఎంతో ఉపయోగపడింది అని గంభీర్ చెప్పాడు. “హర్షల్ పటేల్ అద్బుతమైన బౌలర్. అతడు తన మొదటి మ్యాచ్ ఆడుతున్నట్లు అనిపించలేదు. అతడి ప్రదర్శన నన్ను చాలా ఆకట్టుకుంది. 8-10 సంవత్సరాల ఫస్ట్-క్లాస్ క్రికెట్, ఐపీఎల్‌లో ఆడడం అతనికి కలిసొచ్చింది. ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ ఏ విధంగా అయితే రాణించాడో భారత తరుపున అదే విధంగా రాణించాలి అని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ స్ధాయిలో ఆడటం పట్ల అతడు చాలా సంతోషంగా ఉన్నాడు” అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.