ఊహించని పరిణామం… నితిన్‌పై విజయ్‌ పైచేయి

Geetha Govindam teaser gets Highest Views than Srinivasa Kalyanam Teaser

సినిమా పరిశ్రమలో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అవ్వడం గురించి మనం పలు సార్లు వింటూనే ఉంటాం. తాజాగా ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిన హీరో అంటే విజయ్‌ దేవరకొండ. పెళ్లి చూపులు మరియు అర్జున్‌ రెడ్డి చిత్రాల తర్వాత ఒక్కసారిగా విజయ్‌ దేవరకొండ రేంజ్‌ పెరిగి పోయింది. అంతకు ముందు వరకు పాతిక లక్షల పారితోషికం కూడా ఇతడికి ఎక్కువే అన్నవారు ఇప్పుడు అయిదు కోట్ల అడ్వాన్స్‌తో ముందు నిల్చుంటున్నారు. ఒక్క సినిమా విజయ్‌ దేవరకొండతో నిర్మించాలని ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈయన క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంది అంటే చాలా  కాలంగా ఇండస్ట్రీలో ఉన్న నైజాం కుర్రాడు నితిన్‌ను సైతం బ్రేక్‌ చేసేశాడు.

నితిన్‌ తాజాగా ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో నటించాడు. ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ఎత్తున సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దిల్‌రాజు నిర్మాత అవ్వడంతో ఆ అంచనాలు డబుల్‌ ఉన్నాయి. అంతటి అంచనాలున్న శ్రీనివాస కళ్యాణం సినిమాపై విజయ్‌ మూవీ అయిన ‘గీత గోవిందం’ పై చేయి సాధించింది. ఒక్క రోజు తేడాతో నితిన్‌ శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్‌ మరియు గీత గోవిందం టీజర్‌లు విడుదల అయ్యాయి. ఈ రెంటిలో గీతా గోవిందం పై చేయి సాధించింది. అత్యధిక వ్యూస్‌ను దక్కించుకుని యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతుంది. మొదటి స్థానంలో గీతా గోవిందం ఉండగా రెండవ స్థానంలో శ్రీనివాస కళ్యాణం ఉంది. నితిన్‌పై ఇప్పటికే పై చేయి సాధించిన విజయ్‌ దేవర కొండ విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటాడో చూడాలి. కేవలం వారం తేడాతో ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మొదట నితిన్‌, ఆ తర్వాత ఆగస్టు 15న విజయ్‌లు రానున్నారు. ఏ సినిమా ఎక్కువ వసూళ్లను రాబడుతుందో చూడాలి.