పిల్లల గురించి ఎంతో ఆందోళన చెందాను

పిల్లల గురించి ఎంతో ఆందోళన చెందాను

నటి జెనీలియా కోవిడ్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన హోం క్వారంటైన్‌ అనుభవాలను వివరించారు జెనీలియా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘టెస్ట్‌ చేయించడం వల్ల కరోనా అని తెలిసింది. లేకపోతే ఎన్నటికి తెలిసేది కాదేమో. ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే.. అందరూ టెస్ట్‌ చేయించుకోవడం ఉత్తమం. నా విషయానికి వస్తే.. నాకు కరోనా పాజిటివ్‌ వస్తుందని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే నాకు జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపించలేదు. ఇక ఇంటి నుంచి అసలు బయటకే వెళ్లలేదు.

కానీ పాజిటివ్‌ వచ్చింది. దాంతో కాస్త ఆందోళన చెందాను. కానీ వెంటనే నేను వేరే ఇంటికి మారాను. అక్కడే 21 రోజులు క్వారంటైన్‌లో ఉన్నాను. ఇక నన్ను నేను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేశాను. కుటుంబానికి దూరంగా ఉండటం చాలా కష్టం. ఇంట్లో వేరే గదిలో క్వారంటైన్‌లో ఉంటే అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది. కనీసం ఇంట్లో వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు.. ఏం చేస్తున్నారో తెలుస్తుంది. కానీ నేను వేరే ఇంట్లో ఉండటంతో చాలా బాధపడ్డాను. అసలు తగ్గకపోతే ఏంటి పరిస్థితి అనిపించింది. ఇది నిజంగా చాలా కష్టం’ అన్నారు జెనీలియా.

ఇక పిల్లల గురించి ఎంతో ఆందోళన చెందాను అన్నారు జెనీలియా. ‘రితేష్‌ వారి బాధ్యత తీసకున్నాడు. చాలా బాగా చూసుకున్నాడు. ఇటు నన్ను.. అటు పిల్లల్ని ఎంతో బాగా చూసుకోగలిగాడు. నిజంగా చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. కానీ ఇంటర్నెట్‌, ఇతర వ్యాపకాలు ఒంటరితనాన్ని దూరం చేయలేవు’ అన్నారు జెనీలియా. కోవిడ్‌ పట్ల సమాజం తీరు గురించి ఆమె విచారం వ్యక్తం చేశారు.

ఇలాంటి బాధ్యతారహిత సమాజంలో ఉన్నందుకు క్షమించక తప్పదు అన్నారు. బాలీవుడ్‌తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జెనీలియా.. దక్షిణాదిన అగ్ర తారగా వెలుగొందిన విషయం తెలిసిందే. అరంగేట్ర సినిమాలో తనకు జోడిగా నటించిన రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బాలీవుడ్‌ అన్యోన్య జంటల్లో ఒకటిగా చెప్పుకొనే రితేశ్‌-జెనీలియాలకు రియాన్‌, రేహిల్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా రితేశ్‌.. మహారాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారుడన్న సంగతి తెలిసిందే