Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీవీ సీరియళ్లు మనదేశంలో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇష్టమైన సీరియల్ కోసం మహిళలు రోజంతా ఎదురుచూస్తుంటారనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ ఉన్నా… ఏ పనిలో ఉన్నా… కరెక్ట్ గా సీరియల్ టైంకు టీవీల ముందు ప్రత్యక్షమవుతారు. దూరదర్శన్ కాలం నుంచే మన దేశంలో ఈ అలవాటు ఉంది. డిజిటల్ యుగంలోనూ సీరియల్స్ కు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు సరికదా… మరింత పెరిగింది. టీవీల్లోనే కాకుండా… కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లు… చివరకు మొబైల్స్ లో సైతం ప్రేక్షకులు సీరియల్స్ ను చూస్తున్నారు. సీరియల్స్ మహిళల మనసులను చెడగొడుతున్నాయని, సమాజంపై దుష్ప్రభావం చూపిస్తున్నాయన్న వాదనను పక్కనపెడితే… ఇవాళ సీరియళ్ల ప్రసారం లేని ఎంటర్ టైన్ మెంట్ టీవీ చానల్ లేదు.
సరిగ్గా చెప్పాలంటే… కొన్ని టీవీ చానళ్లు సీరియల్స్ వల్లే మనుగడ సాగిస్తున్నాయి. ఈ సీరియల్స్ పిచ్చి ఒక్క మనదేశానికే పరిమితం కాదు… ప్రపంచంలోని చాలా దేశాల్లో సీరియళ్లు ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే ఘనా దేశ ప్రేక్షకులకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే… వారు అమితంగా ఇష్టపడుతోంది భారతీయ సీరియల్ ను కాబట్టి. అవును హిందీ టీవీ సీరియల్ కుమ్ కుమ్ భాగ్య ఘనాలో ఘనవిజయం సాధించింది. 2015 నుంచి స్థానిక భాషలో డబ్ అయి ఈ సీరియల్ ఘనాలో ప్రసారమవుతోంది. చిన్నా, పెద్దా… ఆడా,మగా, సాధారణ, సెలబ్రిటీ అన్నతేడాలేకుండా ఘనా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ సీరియల్ కు అభిమానులుగా మారిపోయారు. ఈ సీరియల్ ఆ దేశంలో ఎంతగా ప్రజాదారణ పొందిందంటే… అక్కడి విద్యార్థులకు పరీక్షల్లో కూడా సీరియల్ కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు.
అండర్ -17 ప్రపంచకప్ ఫుట్ బాల్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్ ను ముంబైలో ఆడనున్నామని తెలియగానే ఘనా ఫుట్ బాలర్లు ఎగిరి గంతేశారు. కారణం ఏంటంటే… ముంబైలో కుమ్ కుమ్ భాగ్య సీరియల్ నటీనటుల ఆటోగ్రాఫ్ లు తీసుకోవచ్చని సంతోషంతో. అండర్ -17 ఆటగాళ్లే కాదు… ఫుట్ బాల్ బోర్డు చైర్మన్ కూడా ఈ సీరియల్ కు అభిమానే. కుమ్ కుమ్ భాగ్య నటీనటులు, నిర్మాతలు ఇలా ఎవరు దొరికినా సరే… వాళ్ల ఆటోగ్రాప్ లు తీసుకుని, వారితో ఫొటో దిగాలనుకుంటున్నామని, తమకు కనీసం ఐదు నిమిషాల సమయం దొరికినా చాలని ఫుట్ బాల్ బోర్డు చైర్మన్ క్వాడ్వో అగ్యే మాంగ్ చెప్పారు. తమ దేశస్థులు మొబైల్ లో కూడా ఈ సీరియల్ చూస్తారని, ఆటగాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదని, అందుకే ఆటపై ఏకాగ్రత దెబ్బతింటుందన్న భయంతో ప్లేయర్ల సెల్ ఫోన్లు తమ దగ్గర పెట్టుకున్నామని ఆయన తెలిపారు. తానూ సీరియల్ చూస్తానని, అందుకే తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో చెప్పమని తనను అడుగుతుంటారని క్వాడ్వో తెలిపారు. మొత్తానికి ఓ భారతీయ సీరియల్ ఖండాంతరాలు దాటి ప్రజాదరణ పొందిందన్నమాట.