జీన్స్ వేసుకుందని చంపేశారు

జీన్స్ వేసుకుందని చంపేశారు

17 ఏళ్ల బాలిక శవం ఓ నది వంతెనకు కొద్ది గంటల పాటు వేలాడుతుండటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది. బాలిక మృతదేహాన్ని నదిలోకి విసిరేయడానికి ప్రయత్నించగా.. వంతెన రైలింగ్‌కు తగిలి మధ్యలో ఇరుక్కుపోయింది. బాలిక తాత, బాబాయిలు ఆమెను కొట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే, బాలికను ఎందుకు చంపారనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కానీ, బాలిక జీవనశైలిపై అసూయతోనే ఈ ఘాతకానికి పాల్పడ్డారని ఆమె బంధువు ఒకరు తెలిపారు.

వంతెనపై శవం వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెయిలింగ్‌కు తగిలి చిక్కుకున్న మృతదేహాన్ని స్థానికుల సాయంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు వీడియోలో కనబడుతోంది. ఇదే సమయంలో పోలీస్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్టు మరో వీడియోలో ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. వలస కార్మికుడైన మృతురాలి తండ్రి పంజాబ్‌లో ఉంటున్నాడు. బాలిక, ఆమె తల్లి ఇటీవలే లూధియానా నుంచి డియోరియాలోని తమ స్వగ్రామానికి వచ్చారు.

బాలిక జీన్స్ వేసుకోవడం పట్ల తాత, కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశాడు. చాలా సంవత్సరాలు పట్టణంలో ఉండటం వల్ల బాలిక సంప్రదాయ దుస్తులు ధరించడానికి ఇష్టపడలేదు. దీని వారికి నచ్చలేదు. ‘ఈ వ్యక్తులు తరుచూ అమ్మాయి, ఆమె కుటుంబం జీవనశైలి గురించి వ్యతిరేకిస్తుంటారు.. వారు తినే తిండి నుంచి వేసుకునే బట్టల వరకూ ప్రతీ అంశంపై అసూయ వెళ్లగక్కుతారు.. బాలిక తలపై రాడ్‌తో కొట్టడం వల్ల ఆమె తీవ్రంగా గాయపడింది.. ఆసుపత్రికి తీసుకువెళుతున్నామని తల్లికి చెప్పారు.. కానీ, ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మార్గమధ్యలో వంతెనపై నుంచి నదిలోకి పడేశారు’ అని బాలిక పిన్ని తెలిపింది.

ఘటనపై డియోరియా పోలీస్ అధికారి శ్రీపతి మిశ్రా మాట్లాడుతూ.. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ‘‘అమ్మాయి తన తాతతో వాగ్వాదానికి దిగి అతడిని దూషించింది.. దీంతో అమ్మాయి ముగ్గురు బాబాయిలు ఆమెపై దాడి చేయడంతో అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది.. బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలోనే చనిపోయింది… మృతదేహాన్ని నదిలో విసిరేయడానికి ప్రయత్నించారు… కానీ వంతెన రైలింగ్‌కు తగిలి చిక్కుకుంది’’ అని మిశ్రా అన్నారు.బాలిక తాత హస్నైన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు కోసం గాలిస్తున్నారు. తర్వలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. హస్నైన్ ఆటో నడుపుతుంటాడని పోలీసులు పేర్కొన్నారు.