హైదరాబాద్ నగరంలోని మియపూర్ హనీఫ్ కాలనీలో దారుణం జరిగింది. తరుచూ సెల్ఫోన్లో ఛాటింగ్ చేస్తోందన్న కోపంతో బాలికపై సొంత బాబాయే కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేశాడు. హనీఫ్కాలనీకి చెందిన బాలిక కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆన్లైన్ క్లాసులు ఉండటంతో తండ్రి సెల్ఫోన్ కొనిచ్చాడు. అయితే క్లాసులు ముగిసిన తర్వాత బాలిక సెల్ఫోన్లో తరుచూ ఛాటింగ్ చేస్తున్నట్లు కుటుంబసభ్యులు గుర్తించారు.
బాలిక బాబాయ్ దీనిపై ఆరా తీయగా వరుసకు మామ అయ్యే యువకుడితో ఛాటింగ్ చేస్తు్న్నట్లు తెలిసింది. దీంతో బుద్ధిగా ఉండాలని బాలికను హెచ్చరించాడు. అయినప్పటికీ బాలిక పట్టించుకోకుండా ఛాటింగ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గత నెల 28వ తేదీన బాలిక తండ్రి పనికి వెళ్లిన సమయంలో బాలికతో బాబాయి గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయి ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.