ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.. తీరా పెళ్లి దాకా వచ్చే సరికి ప్రియుడు నిరాకరించటంతో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు… సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన అలవాల డేవిడ్‌రాజు, రాణి దంపతుల కుమార్తె ప్రత్యూష(18) సిరిసిల్లలో డిప్లొమా చదువుతోంది. కరోనా కారణంగా క్లాసులు లేకపోవటంతో గతేడాది నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోందని బంధువులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రత్యూష అమ్మమ్మ సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఉండటంతో అక్కడకు వస్తూపోతూ ఉండేది. ఈ క్రమంలో అదే ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న బండి భాస్కర్‌రావు, వెంకటమ్మల కుమారుడు జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత జగదీష్ పెళ్లికి నో చెప్పడంతో.. మనస్తాపానికి గురైన ప్రత్యూష ఏప్రిల్‌లో 30న హైదరాబాద్‌లో శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందింది. దీంతో ప్రియుడు జగదీష్ కారణంగానే ప్రత్యూష మృతి చెందిందని బషిర్‌బాగ్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తుంబూరులో నివాసం ఉంటున్న ప్రియుడు జగదీష్ ఇంటి ఎదుట మంగళవారం ప్రత్యూష మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో జగదీష్, తల్లిదండ్రులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎస్సై జి.నరేష్ సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి, ధర్నాను విరమింపజేశారు.