నా జీవితంలో కష్టం తప్ప ఏ నాడూ సుఖపడలేదమ్మా

నా జీవితంలో కష్టం తప్ప ఏ నాడూ సుఖపడలేదమ్మా

కట్టుకున్న భార్య ప్రవర్తన నచ్చక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని మిట్టగూడెంనకు చెందిన ఆళ్ల వెంకటేశ్వరరావు  బైక్‌ మెకానిక్‌గా జీవిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం రాచేపల్లికి చెందిన కృష్ణవేణితో అతనికి వివాహమైంది. కొన్నేళ్ల పాటు సజావుగానే ఉన్నా ఇటీవల ఆమె మరొక వ్యక్తికి విహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడే భర్తపై కేసు పెట్టింది. అయితే పెద్దలు రాజీచేసి ఆమెను కాపురానికి పంపించారు.

రెండు, మూడు రోజుల క్రితం భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లగా ఆమె ప్రవర్తన నచ్చక రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాను పనిచేస్తున్న షెడ్డులోనే వెంకటేశ్వరరావు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘అమ్మా నన్ను క్షమించు. ఇక నీతో మాట్లాడలేనమ్మా. ఇవే నా ఆఖరి మాటలమ్మా. నేను చచ్చిపోతున్నాను. మీరు నా గురించి ఆగం కావద్దు. ఇద్దరు తమ్ముళ్లను మంచిగా చూసుకుంటూ ఆనందంగా ఉండండమ్మా. మీరు సంతోషంగా ఉంటే చాలమ్మా.

నా జీవితంలో కష్టం తప్ప ఏ నాడూ సుఖపడలేదమ్మా. మీ అందరినీ వదిలిపెట్టి పోవాలని లేదు. అన్ని విధాలా మోసపోయాను. నేను చనిపోయిన తరువాత కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టకోనివ్వద్దు. నా చేతిపై ఆమె పేరు ఉంది. దానిని తీసేసి దహనం సంస్కారాలు చేయండి’ అని కన్నీటి పర్యంతమై ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మృతుడి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ–2 రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.