తుమకూరు నగరం ఆదర్శనగరలో జడ్పీ సభ్యుడు, బీజేపీ నాయకుని ఇంట్లో మైనర్ బాలిక అనుమానాస్పదరీతిలో మరణించింది. మృతురాలు (17). జడ్పీ సభ్యుడు రామాంజినప్ప నివాసంలో బెడ్‌రూంలో మంచం పైన శవంగా పడి ఉంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. తుమకూరు తాలూకాలోని బిదరెకట్టి గ్రామానికి చెందిన శివణ్ణ, మంజుళ దంపతులు 10 ఏళ్లుగా శాంతి నగరంలో నివాసం ఉంటున్నారు.
శివణ్ణ పానిపూరి వ్యాపారం చేస్తుండగా మంజుళ జడ్పీ సభ్యుని ఇంట్లో పనిమనిషిగా ఉంది. వీరి కూతురు తల్లితో కలిసి పనికి వెళుతుంది. ఆదివారం తల్లి పనికి వెళ్లక పోవడంతో ఒంటరిగా జడ్పీ సభ్యుని ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో అమ్మాయి మృతి చెందినట్లు తెలిసింది. రామాంజినప్ప తుమకూరు నగర పోలీసులకు సమాచారం ఇవ్వగా వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలికను హత్య చేశారా?, ఏం జరిగిందన్నది సస్పెన్స్‌గా మారింది.