మాదాపూర్ రోడ్డు ప్రమాదం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కారు నడిపిన యువకుడు సృజన్ కుమార్ ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సృజన్ కారుపై 11 ఈ చలాన్లు ఉన్నట్లు, ఈ 11 చలాన్లు కూడా ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్వేనని తేలింది. కాగా ఆగి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను మహేంద్ర ఎక్స్‌యూవీ కారు ఢీ కొనడంతో వెనుక కూర్చున్న ఓ యువతి మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపిన మేరకు.. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నేరేడ్మెట్కు చెందిన టి.అజయ్ తన స్నేహితురాలు జెన్నీఫర్ డిక్రూజ్‌తో కలసి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై కొత్తగూడ వైపు నుంచి సైబర్ టవర్స్ వైపు వస్తున్నాడు. మార్గమధ్యలో సీఐఐ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగారు.
అదే సమయంలో మహేంద్ర ఎక్స్‌యూవీ కారును డ్రైవర్ అతి వేగంగా నడుపుతూ వచ్చి ఆగి ఉన్న బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో వెనుక కూర్చున్న జెన్నీఫర్ డిక్రూజ్‌కి బలమైన గాయాలయ్యాయి. ఆమెను వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. అజయ్‌కు ఎడమ చేయి, ఎడమ కాలు, వెన్నుముకకు బలమైన గాయాలయ్యాయి. కార్ డ్రావర్ పరారయ్యాడు. యువతి తండ్రి జాన్‌సిరిల్ డిక్రూజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.
కాగా అజయ్, జెన్నీఫర్‌కు ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆ కుంటుంబాల్లో ఈ రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఓ కుటుంబానికి కడుపుకోత మిగల్చడంతోపాటు మరో కుటుంబానికి కొడుకు ఎప్పటికి తేరుకుంటాడో తెలియని పరిస్థితిలోకి నెట్టేసింది.