వాటర్ బాటిల్ లో యాసిడ్ తాగి బాలిక దుర్మరణం !

Girl Drinks Acid Instead Of Water

వాటర్ బాటిల్‌లా ఉన్న యాసిడ్ బాటిల్ ఓ చిన్నారి ప్రాణం తీసింది. విచిత్రంగా మంచినీళ్లు అనుకుని, యాసిడ్ బాటిల్ స్కూల్‌కి తీసుకెళ్లిన బాలికకు ఏమీ కాలేదు కానీ అది వాటర్ అనుకుని తాగిన ఆమె క్లాస్‌మేట్ చనిపోయింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని హర్షవిహార్ ఏరియాలో ఉన్న దీప్ భారతి పబ్లిక్ స్కూల్‌లో ఐదో క్లాస్ చదువుతోంది 11 ఏళ్ల సంజన. మధ్యాహ్న సమయంలో తన స్నేహితురాలుతో కలిసి భోజనం చేస్తోంది సంజన. మధ్యలో దాహం వేయడంతో ఫ్రెండ్ తెచ్చిన వాటర్‌బాటిల్ తీసుకుని, తాగింది. అంతే అరుపులు, కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోయింది.

బాలికను గమనించిన తన స్నేహితులు టీచర్‌కు విషయం చెప్పారు. వారు వెంటనే స్పందించి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. సంజన శరీరంలోపలి భాగాలు కాలిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది సంజన. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు యాసిడ్ బాటిల్ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేశారు. నాలుగో తరగతి చదువుతున్న బాలిక, కిచెన్‌లో ఉన్న యాసిడ్ బాటిల్‌ను వాటర్ బాటిల్‌గా భావించి స్కూల్‌కి తీసుకెళ్లిందని విచారణలో తేలింది. అదృష్టవశాత్తు యాసిడ్ బాటిల్ తీసుకెళ్లిన చిన్నారి ప్రమాదం నుంచి తప్పించుకోగా ఆమె స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి తీసుకెళ్తున్న బాటిల్‌ను తల్లి గమనించినా యాసిడ్ బాటిల్ తీసుకొచ్చిన విషయాన్ని టీచర్లు, ఆయాలు గుర్తించినా ఈ ప్రమాదం జరిగేది కాదని పోలీసులు చెబుతున్నారు.